కలం, ఖమ్మం బ్యూరో : శాసనసభ వద్ద ప్రజాసమస్యలపై గళమెత్తుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని నిరసిస్తూ అశ్వారావుపేట (Aswaraopeta) నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోమవారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నపురెడ్డిపల్లిలోని ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో (BRS Protest) నిర్వహించడంతో వాహన రాకపోకలు స్తంభించాయి.
ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పోలీసులు తోపులాట జరిపి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు గాయాలు కలిగించడం, మహిళా ఎమ్మెల్యేల పట్ల చీరలు లాగుతూ దారుణంగా ప్రవర్తించడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, రౌడీ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను కింద పడేసి తొక్కిన ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి రోజని, ప్రస్తుతం నడుస్తున్నది ప్రజాస్వామ్యమా లేక రౌడీ రాజ్యమా అని ఆయన నిలదీశారు.
గత బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రతిపక్షాలపై ఇలాంటి దాడులు జరగలేదని గుర్తుచేసిన ఆయన, కేటీఆర్, హరీష్ రావు లేదా ఇతర ఎమ్మెల్యేలకు ఏమైనా హాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

