కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ (BRS Protest) చేపట్టిన నిరసనలు కరీంనగర్‌లో ఉధృతమయ్యాయి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించేందుకు నల్ల చొక్కాలు ధరించి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం గులాబీ శ్రేణులు రోడ్డెక్కాయి. కరీంనగర్ బీఆర్‌ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ (Challa Harishankar) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కరీంనగర్ బస్టాండ్ ఎదుటకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారీగా ట్రాఫిక్ జామ్..
ఆందోళనతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ లేకపోవడంతో నిరాశ నెలకొందని విమర్శించారు. పేదలకు ఆసరా పెన్షన్లు, రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు..
జీవితకాలం సేవ చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని హరిశంకర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారనే భయంతోనే వారిని అడ్డుకుని అరెస్టు చేయించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, వారిని అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై గళం విప్పితే అణచివేయాలని చూస్తే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్ను అనిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు. డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాస్తారోకలో పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు.

