పోలీస్ ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణను ప్రారంభించిన సీపీ

కలం, నిజామాబాద్ బ్యూరో: పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ (Nizamabad Police) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ ఆడిటోరియంలో సీపీ సాయి చైతన్య ప్రారంభించారు. తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ తదితర ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వం అందించడంతోపాటు పోటీ పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా వారిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమం 60 రోజులపాటు కొనసాగుతుంది. హైదరాబాద్‌కు చెందిన భాగ్య కిరణ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులచే అభ్యర్థులకు శిక్షణ అందించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి. ఈ శిక్షణ కార్యక్రమం నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతుంది.

పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ..

శిక్షణలో భాగంగా పోలీస్ రిక్రూట్‌మెంట్ పోటీ పరీక్షలకు అవసరమైన వివిధ అంశాలపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన కల్పించనున్నారు. పరీక్షలో ప్రశ్నలను వేగంగా, కచ్చితంగా పరిష్కరించే విధానం, సమయపాలన, పరీక్షా విధానం, ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం వంటి అంశాల్లో నిపుణులచే మార్గదర్శకత్వం అందించనున్నారు. అలాగే అభ్యర్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా శిక్షణ అందించడంతో పాటు, నిరంతర సాధన ద్వారా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రోత్సహించనున్నారు.

యువత లక్ష్యాన్ని సాధించాలి..

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. పోలీస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

బలహీనతలను అధిగమించాలి..

అభ్యర్థులు ఈ 60 రోజుల శిక్షణను ఎంతో విలువైన అవకాశంగా భావించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, అధ్యాపకులు సూచించే విధంగా కష్టపడి చదివి నిరంతరం సాధన చేయాలని కమిషనర్ సూచించారు. కేవలం శిక్షణకు హాజరవడం మాత్రమే కాకుండా ప్రతిరోజూ నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవాలన్నారు. తమ బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే స్పష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధించవచ్చని అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో గిరిరాజ్ కాలేజీ ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, భాగ్య కిరణ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ భాగ్య కిరణ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీటీసీఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, నిజామాబాద్ రూరల్ సీఐలు సతీష్ కుమార్, శ్రీనివాస్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలత, సీసీఆర్బి ఎస్ఐ వరప్రసాద్ రెడ్డి, టౌన్ – 3 ఎస్ఐ హరిబాబు , టౌన్ – 6 ఎస్సై సందీప్, టౌన్ – 5 ఎస్ఐ సునీల్, సీసీఆర్బి ఎస్ఐ వెంకట్రావు, ఫాకల్టీ, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>