మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ధర్నా.. కీలక డిమాండ్లు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కేంద్ర వేతన సలహా మండలిలో సీఐటీయూను చేర్చాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి (Kurumurthy) డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ మహబూబ్ నగర్ ( Mahabubnagar) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా (CITU Protest) నిర్వహించారు.

ఈ సందర్భంగా నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ.. దేశంలో కార్మిక వర్గం తరఫున నికరంగా, నిజాయితీగా పోరాటాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమాలను, పోరాటాలను నడుపుతున్న సీఐటీయూను కేంద్ర కనీస వేతనాల సలహా బోర్డులో సీఐటీయూతో పాటు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లను సలహా బోర్డులో తీసుకోకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు చేపట్టడంలో ఇది ప్రత్యక్ష నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

యజమానుల తరఫున, కార్పొరేట్ల తరఫున ఉండే బీఎంఎస్ తదితర కార్మిక సంఘాలను కనీస వేతనాల సలహా బోర్డులో నియమించి, కార్మికుల తరఫున పోరాటాలు చేస్తున్న సీఐటీయూ లాంటి పెద్ద కార్మిక సంఘాన్ని పక్కకు పెట్టడం కార్మికులకు అన్యాయం చేయడమేనని ఆయన అన్నారు. కార్మిక హక్కుల కోసం వేతనాల పెంపుదలకై, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాల కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూను కనీస వేతనాల సలహా బోర్డులో వెంటనే తీసుకొని, కార్మికుల పక్షాన వేతనాలు నిర్ణయించడంలోనూ యాజమాన్యాలతో, ప్రభుత్వంతో త్రైపాక్షిక చర్చలు జరపడానికి అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కమరలి, వరదగాలన్నలు మాట్లాడుతూ.. సంవత్సరాల తరబడి కార్మిక హక్కుల కోసం కనీస వేతనాల కోసం, కార్మికుల జీవన భద్రత కోసం పోరాడుతున్న సీఐటీయూకు కనీస వేతనాల సలహా బోర్డులో తీసుకోకపోవడం దుర్మార్గమని, మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని విమర్శించారు.

గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. వెంకటేష్ గౌడ్, జిల్లా నాయకులు నారాయణలు మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత రంగంలో రాజీలేని పోరాటాలు చేస్తున్న సీఐటీయూకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు, మూడ మాజీ చైర్మన్ గంజి వెంకన్న మాట్లాడుతూ.. భవనిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును కూడా ఎత్తివేయాలని ఆలోచన చేస్తున్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని సీఐటీయూ కనీస వేతనాల బోర్డులో నియమించాలని డిమాండ్ చేశారు. ఇందులో మున్సిపల్ గ్రామపంచాయతీ భవన నిర్మాణ, తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>