కలం, స్పోర్ట్స్: ఆసియా గేమ్స్ (Asian Games) లో భారత వుషు క్రీడాకారిణి రోషిబినా దేవి (Roshibina Devi) అద్భుత ప్రదర్శనతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 60 కేజీల సండా సెమీఫైనల్ పోరులో ఆమె ఘనవిజయాన్ని సాధించింది. దీనితో భారతదేశానికి కనీసం రజత పతకం ఖాయమవ్వడమే కాకుండా, ఆసియా క్రీడల వుషు చరిత్రలో దేశానికి అత్యుత్తమ ఫలితం సమమైంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో 25 ఏళ్ల రోషిబినా దేవి ఇండోనేషియాకు చెందిన థానియా కుసుమానింగ్త్యాయస్‌పై 2-0 తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.
వాస్తవానికి ఈ టోర్నీ కోసం ప్రకటించిన ఆరంభ భారత జట్టులో ఆమె పేరు లేదు. దివ్యాంశి గాయపడటంతో ఆమె స్థానంలో రోషిబినాకు జట్టులో అవకాశం లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆమె ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2000 సంవత్సరం డిసెంబర్ 30న మణిపూర్ రాష్ట్రం బిష్ణుపూర్ జిల్లాలోని క్వాసిఫై మయాయ్ లైకాయ్‌లో రోషిబినా జన్మించింది. పంచ్, కిక్, త్రోల కలయికగా ఉండే సండా విభాగంలో ఆమె పోటీపడుతుంది.
2018 జకర్తా ఆసియా గేమ్స్ క్వార్టర్స్‌లో పాకిస్తాన్‌కు చెందిన ముబాష్రా అక్తర్‌పై గెలిచి కాంస్య పతకం సాధించడం ద్వారా ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023 హాంజౌ ఆసియా గేమ్స్‌లో రజతం గెలిచిన ఆమె, అర్జున అవార్డును కూడా అందుకుంది. ఇప్పుడు వరుసగా మూడో ఆసియా గేమ్స్‌లో పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో రోషిబినా ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
సోమవారం జరిగిన ప్రీ-క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన షికా ఖాతున్‌ను, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో చూ మాన్ సిన్‌ను 5-0తో ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు సెమీస్‌లో గెలిచి పసిడి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. గురువారం భారత కాలమానం ప్రకారం ఉదయం 6:10 గంటలకు జరగనున్న ఫైనల్లో చైనాకు చెందిన జంగ్ జియావోయుతో రోషిబినా తలపడనుంది.

