కరువుపై బీఆర్ఎస్‌ది నీచ రాజకీయం: మంత్రి ఉత్తమ్

కలం, హుజూర్‌నగర్ :  ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులకు ధైర్యాన్ని, భరోసానివ్వాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ (BRS)కరువు రావాలని, పంటలు ఎండిపోవాలని కోరుకుంటూ పైశాచికానందం పొందుతోంది’ అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆకాశంలో ఎల్‌నినో వర్షాలను అడ్డుకుంటే భూమిపై బీఆర్ఎస్‌ అబద్ధాల వరద పారిస్తోందని మండిపడ్డారు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో రూ.26.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నేరేడుచర్ల–దూపాడు డబుల్ రోడ్డుతో పాటు, జానల్‌దిన్నె గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.33 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. మొత్తం రూ.26.93 కోట్ల వ్యయంతో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్‌ దివాలాకోరు రాజకీయం చేస్తోందని మంత్రి విమర్శించారు. “ఎల్‌నినో అనేది కాంగ్రెస్ కార్యాలయంలో పుట్టిన పదం కాదు. ప్రపంచవ్యాప్తంగా పసిఫిక్ మహాసముద్రంలో జరిగే మార్పుల వల్ల ఏర్పడే శాస్త్రీయ పరిణామం. దీనివల్ల రుతుపవనాల ప్రభావం తగ్గి కొన్ని దశల్లో వర్షపాతం 40 శాతం వరకు తగ్గింది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ప్రతిపక్షం విషప్రచారం చేస్తోంది. రైతు పొలంలో పంట ఎండిపోతే ప్రభుత్వానికి బాధ కలుగుతుంది.. కానీ బీఆర్ఎస్‌కు మాత్రం రాజకీయ అవకాశం కనిపిస్తోంది. రైతు కన్నీటిలో ఓట్లు వెతకడం కంటే నీచమైన రాజకీయం మరొకటి ఉండదు” అని దుయ్యబట్టారు.

కర్ణాటక నీళ్ల కోసం డి.కె. శివకుమార్‌తో చర్చలు

జూరాల ఆయకట్టు కింద సాగు చేసిన ఖరీఫ్ పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తనకున్న వ్యక్తిగత స్నేహంతో కర్ణాటక ముఖ్యమంత్రి DK శివకుమార్‌తో మంతనాలు జరిపానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి నీటి లభ్యతను బట్టి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

ఒకవైపు తాము పొలాలను కాపాడేందుకు పొరుగు రాష్ట్రాల తలుపు తడుతుంటే  బీఆర్ఎస్‌ నేతలు మాత్రం రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చేసిన ప్రతి ఎకరా పంటనూ కాపాడేందుకు నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు. జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ, రాబోయే వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నామన్నారు.

ఈ ప్రాంతంతోది ప్రేమానుబంధం

హైదరాబాద్‌లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సన్నాహక సమావేశం ఉన్నప్పటికీ నేరేడుచర్ల ప్రజల కోసం ఇక్కడికి వచ్చానని మంత్రి చెప్పారు. నూతన రోడ్డు నిర్మాణంతో నేరేడుచర్ల, పత్తేపురం, వైకుంఠపురం, రామలక్ష్మీపురం, మేడారం, బక్కయ్యగూడెం, దూపాడు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు.”మీ శ్రమ, ఆదరాభిమానాలతోనే నేను 6 సార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యాను ఈ రుణాన్ని అభివృద్ధితోనే తీర్చుకుంటాను” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

పార్టీకి కార్యకర్తలు, నాయకులే వెన్నెముక అని పేర్కొంటూ, ఇటీవల నిర్వహించిన కోదాడ మెగా జాబ్ మేళా ద్వారా వందలాది మంది యువతకు ఉపాధి లభించడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. బీఆర్ఎస్ చేసే అవాస్తవ ప్రచారాన్ని కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>