పీటీ ఉష రికార్డు బద్దలు.. ఆసియా క్రీడల్లో విత్యకు కాంస్యం

కలం, స్పోర్ట్స్ : భారత అథ్లెట్ విత్య రామరాజ్ (Vithya Ramraj) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడలు 2026లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్ పోటీల్లో ఆమె కాంస్య పతకం కైవసం చేసుకుంది. 54.75 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని, పీటీ ఉష పేరు మీద ఉన్న 42 ఏళ్ల నాటి జాతీయ రికార్డును తుడిచిపెట్టేసింది.

2023 హ్యాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో విత్య 55.42 సెకన్ల టైమింగ్‌తో పీటీ ఉష రికార్డును సమం చేసింది. ఈసారి నాగోయా వేదికగా జరిగిన పోటీల్లో తన సొంత రికార్డును 0.67 సెకన్ల మేర మెరుగుపరుచుకుని కొత్త చరిత్ర రాసింది. ఇదే పోటీలో భారత అథ్లెట్ అను రాఘవన్ 55.88 సెకన్ల వ్యక్తిగత ఉత్తమ టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది. అంతకుముందు మిశ్రమ 4×400 మీటర్ల రిలేలోనూ విత్య రజత పతకం సాధించిన జట్టులో భాగమైంది.

ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమార్తె అయిన విత్య (Vithya Ramraj).. అనేక ఆర్థిక ఇబ్బందులను దాటుకుని ఈ స్థాయికి చేరింది. పాఠశాల దశలోనే తల్లి ప్రోత్సాహంతో క్రీడల్లోకి అడుగుపెట్టింది. కోవిడ్ బారిన పడటం, అపెండిసైటిస్ శస్త్రచికిత్స జరగడంతో ఒక దశలో ఆటకు దూరమైనా వెనక్కి తగ్గలేదు. సోదరి నిత్య, కోచ్ రథోర్ ప్రోత్సాహంతో మళ్లీ ట్రాక్‌పైకి వచ్చి మెరుపులు మెరిపించింది. పారిస్ ఒలింపిక్స్ 2024తో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లలోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.

ఎన్నో సవాళ్లను దాటుకుని ప్రపంచ వేదికపై మెరిసిన విత్య రామరాజ్ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అథ్లెటిక్స్ రంగంలో ఆమె సాధిస్తున్న విజయాలు రాబోయే తరం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>