కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games) 2026లో భారత్ మరోసారి విజయదుందుభి మోగించింది. జపాన్‌లోని ఐచి-నాగోయాలో శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురుచి ఇందర్ సింగ్, కమల్‌జీత్ జంట బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం. ఈ ఘనతకు ముందు సురుచి తండ్రి ఆమెను మల్లయోధురాలిగా మార్చాలని భావించారు. కానీ ఆమె మైదానంలో షూటింగ్ వైపే మొగ్గు చూపింది. భివానీలోని గురు ద్రోణాచార్య షూటింగ్ అకాడమీలో కోచ్ సురేష్ సింగ్ వద్ద ఆమె శిక్షణ పొందింది. ఆసియా గేమ్స్‌కు ముందు ఆమె టెక్నిక్, హోల్డింగ్, డ్రై-ఫైర్ ట్రైనింగ్, టైమింగ్ అంశాలపై గంటల తరబడి శ్రమించింది.
నిర్ణీత సమయంలోనే షాట్ పూర్తి చేసేలా కోచ్ ఆమెను సిద్ధం చేశారు.ఈ టోర్నీలోని వ్యక్తిగత 10మీ ఎయిర్ పిస్టల్ అర్హత రౌండ్‌లో సురుచి 568-12x స్కోరుతో 26వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ పరాజయం ఆమెను నిరాశపరిచింది. అయితే సురుచి త్వరగా పుంజుకుంటుందని, ఫైనల్‌కు చేరితే ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తుందని ఆమె కోచ్ సురేష్ విశ్వసించారు.మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో సురుచి, కమల్‌జీత్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.
స్టేజ్ 1లో 103.0తో మొదలుపెట్టి, వరుసగా 202.4, 303.5 స్కోర్లు సాధించారు. ఆ తర్వాత స్టేజ్ 2లోనూ అదే జోరు కొనసాగించి 364.7 స్కోరుతో దక్షిణ కొరియా, ఇరాన్‌లను అధిగమించారు. 18 షాట్ల తర్వాత 424.9 స్కోరుతో ముందంజలో నిలిచారు. చివరకు భారత జంట మొత్తం 484.6 స్కోరు సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన సుహ్యాన్ హాంగ్, గేయున్ చూ జంట 478.0 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి వెండి పతకంతో సరిపెట్టుకుంది.
దక్షిణ కొరియా కంటే భారత జంట 6.6 పాయింట్ల ఆధిక్యంలో నిలవడం వారి ఘనవిజయానికి నిదర్శనం. గతంలో 2025లో బ్యూనస్ ఎయిర్స్, మ్యూనిచ్, లిమా, దోహాలలో జరిగిన నాలుగు ప్రపంచ కప్‌లలో సురుచి స్వర్ణాలు సాధించింది. ప్రస్తుతం ఈ ఆసియా గేమ్స్ విజయంతో దేశమంతా గర్వించేలా చేసిన సురుచికి ఘన స్వాగతం పలికేందుకు ఆమె కోచ్, అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

