కలం, వనపర్తి: జిల్లాలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూసమస్యలను (Land Issues) పరిశీలించేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట్రోత్ హుస్సేన్ నాయక్ సెప్టెంబరు 29న పర్యటించనున్నట్లు బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కమ్మతాడ, వనిగితాడ, లటేమళ్లితాడ తదితర ప్రాంతాల్లో సుమారు 463 ఎకరాల భూమిని స్థానికులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాలు, భూ హక్కుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కొన్ని కుటుంబాలు సుమారు 80 ఏళ్లుగా భూములను సాగు చేస్తున్నా హక్కుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. భూసేకరణ జరిగినా పరిహారం అందని కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వనపర్తి(Wanaparthy) మెడికల్ కళాశాల సమీపంలోని పెద్దగూడెం తండాలోనూ సుమారు 73 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గన్పూర్ ప్రాంతంలోనూ భూసమస్యలు ఉన్నాయని తెలిపారు. గతంలో ట్రై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి సమర్పించిన వినతిపత్రం మేరకు సెప్టెంబరు 29న ఆయా ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారని చెప్పారు.
భూసమస్యలతో పాటు గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందకపోవడం, ఉన్నత విద్యకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న అంశాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రవి నాయక్ తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు రెడ్యా నాయక్, నాయకులు తిరుపతి, లక్ష్మణ్, వసిరాం నాయక్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

