విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (Mendora KGBV) కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, టాయిలెట్లు, తరగతి గదులను పరిశీలించారు. స్టోర్ రూంలో నిలువ ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను గమనించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్ ద్వారా సిబ్బంది హాజరును తనిఖీ చేశారు.

విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూలో పేర్కొన్న క్యారెట్ కర్రీకి బదులుగా ఆలూ కర్రీ వండడాన్ని గమనించిన కలెక్టర్.. నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో డైట్ మెనూ రూపొందించిందని, దానిని పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తే ప్రయోజనం ఏమిటని మందలించారు.

ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, నిరుపయోగ వస్తువులు ఉండడాన్ని గమనించారు. పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిర్మాణ దశలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు.

అనంతరం 6వ తరగతి గదిని కలెక్టర్ (Collector Ila Tripathi) సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను అందించి చిన్నారులను ప్రోత్సహించారు. చక్కగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట స్థానిక ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంఈఓ శ్రీనివాస్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పద్మ, తదితరులు ఉన్నారు.

Also Read : ఎన్నికలే టార్గెట్.. మహిళా కాంగ్రెస్​ కు కొత్త సైన్యం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>