కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games 2026) లో భారత రెజ్లింగ్ జట్టు పతకాల ఖాతాను తెరిచింది. బుధవారం జరిగిన పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సునీల్ కుమార్ (Sunil Kumar) అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన తైజో యోషిడా చేతిలో ఓటమి పాలైన హర్యానాకు చెందిన 27 ఏళ్ల సునీల్ కుమార్, ఆ తర్వాత కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. కాంస్య పతక పోరులో ఫిలిప్పీన్స్ ఆటగాడు కాలమ్ జాన్స్టన్ రాబర్ట్స్ పై ఆరంభం నుంచే సునీల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.
ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా, టెక్నికల్ సుపీరియారిటీ విధానంలో 9-0 తేడాతో సునీల్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో సునీల్ కుమార్ గ్రీకో-రోమన్ విభాగంలో భారతదేశ సుదీర్ఘ నిరీక్షణకు మళ్లీ ప్రాణం పోశారు. గతంలో 2010 గ్వాంగ్జౌ ఆసియా గేమ్స్ (Asian Games) లో రవీందర్ సింగ్, సునీల్ కుమార్ రాణా కాంస్యాలు గెలవగా, ఆ తర్వాత 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2023 హాంజౌ క్రీడల్లోనూ సునీల్ కాంస్యం గెలుచుకున్నారు. ఈసారి కూడా అదే విభాగంలో మెరిసి భారత్ క్రీడా ప్రతిష్ఠను నిలబెట్టారు.

