కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) పట్టణంలోని 32వ వార్డు కేడీఆర్నగర్ (KDR Nagar) లో ప్రధాన డ్రైనేజీలో పేరుకుపోయిన షిల్టును తొలగించే పనులను బుధవారం చేపట్టారు. స్థానిక కౌన్సిలర్ బండారు అరుణజ్యోతి పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రైవేటు కాంట్రాక్టు కార్మికులు, జేసీబీ సహాయంతో డ్రైనేజీ పూడికతీత పనులు నిర్వహించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా డ్రైనేజీలో షిల్టు పేరుకుపోవడంతో మురుగునీరు సరిగా ప్రవహించక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దోమలు, ఈగల బెడదతో పరిసరాల ప్రజలు అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు.
స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ ద్వారా కార్మికులను ఏర్పాటు చేసి పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇళ్లలోని చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్లకు అందించాలని ఆమె కోరారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.

