కలం, స్పోర్ట్స్ : అనారోగ్యంతో ఆసియా క్రీడల్లో (Asian Games) పాల్గొనడమే సందేహంగా మారింది. కానీ భారత ట్రాప్ షూటర్ నీరు ధండా (Neeru Dhanda) వెనక్కి తగ్గలేదు. అనారోగ్యాన్ని అధిగమించి అద్భుత ప్రదర్శన చేసింది. మూడు పతకాలు సాధించింది. ముందుగా వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్లో నీరు స్వర్ణం గెలిచింది. ఆసియా క్రీడల్లో ట్రాప్‌లో వ్యక్తిగత గోల్డ్ గెలిచిన తొలి భారత మహిళగా నిలిచింది. ఆ తర్వాత ఆశిమా అహ్లావత్, మనీషా కీర్తో కలిసి టీమ్ ఈవెంట్లో రజతం సాధించింది. బుధవారం కైనన్ చెనాయ్‌తో కలిసి మిక్స్డ్ టీమ్‌లో బరిలోకి దిగింది.
క్వాలిఫికేషన్లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జోడీ.. మెడల్ రౌండ్లో పుంజుకుంది. ఫైనల్లో ఖతార్‌ను ఓడించి స్వర్ణం సాధించింది. ఈ విజయంతో నీరు (Neeru Dhanda) ఖాతాలో రెండు గోల్డ్స్, ఒక సిల్వర్ చేరాయి. అయితే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించే సమయం ఇంకా దొరకలేదని ఆమె తెలిపింది. తనకు ఈ క్రీడల్లో అతిపెద్ద జ్ఞాపకం పతకాలు కాదని నీరు చెప్పింది. అనారోగ్యం నుంచి కోలుకుని పోటీలో పాల్గొనే స్థాయికి చేరిన విధానమే ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది. ఆ సమయంలో కోచ్ తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పింది.
ఏడాది పాటు చేసిన శిక్షణను గుర్తు చేస్తూ ధైర్యం ఇచ్చారని తెలిపింది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో కైనన్ కూడా చివరి షాట్ వరకు పోరాడాలని ప్రోత్సహించాడు. ఒక్కో షాట్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. నీరు తన మూడు పతకాలకు టీమ్ సహకారం కీలకమని పేర్కొంది. భారత షూటింగ్ వ్యవస్థ, కోచింగ్ సిబ్బంది అందించిన సహకారాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఆసియా క్రీడల్లో తన ప్రదర్శనతో నీరు ధండా భారత షూటింగ్లో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
Also Read : నాగల్ జోరు.. సురేశ్ ఔట్
Follow Us On: X(Twitter)

