Mobile Popup Ad
Mobile Popup Ad

ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌ : పవర్‌హౌస్ జట్టుతో బరిలోకి భారత్!

స్పోర్ట్స్ బ్యూరో, కలం : ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌ (Asian Fencing Championship)కు భారత్ బలమైన జట్టును ప్రకటించింది. భారత ఫెన్సింగ్‌లో దేశపు తొలి ఒలింపియన్ సీఏ భవాని దేవి పేరు కూడా ఉంది. ఆమె నేతృత్వంలో 24 మంది సభ్యులతో కూడిన పవర్‌హౌస్ స్క్వాడ్‌ను ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FAI) ఖరారు చేసింది. జాతీయ స్థాయి సెలక్షన్ గేమ్స్లో ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. జూన్ 19 నుంచి 24 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 26వ సీనియర్ ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ జరగనున్నది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో 30కి పైగా దేశాల నుంచి 400 మందికిపైగా టాప్ ఫెన్సర్లు పాల్గొననున్నారు. స్వదేశంలో ఇంత పెద్ద స్థాయి టోర్నీ నిర్వహించడం భారత ఫెన్సింగ్ చరిత్రలో కీలక ఘట్టంగా భావిస్తున్నారు.

ఆసియా క్రీడల్లో అర్హతకు కీలకం

ఈ పోటీలు కేవలం ఖండస్థాయి చాంపియన్‌షిప్ మాత్రమే కాదు.. 2026 ఆసియా క్రీడలకు అర్హత సాధించే ప్రక్రియలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. అలాగే, లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌కు సన్నాహకంగా కూడా ఈ టోర్నీ చూస్తున్నారు. ప్రపంచ స్థాయి ఫెన్సర్లతో స్వదేశంలోనే తలపడే అవకాశం భారత ఆటగాళ్లకు లభించడం విశేషం.

టోర్నీ నిర్వహణపై విశ్వాసం

ఎఫ్‌ఏఐ అధ్యక్షుడు సతేజ్ డి.పాటిల్ టోర్నీ నిర్వహణపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించగల సామర్థ్యం భారత్‌కు ఉందని, భారత జట్టు కూడా స్వదేశీ ప్రేక్షకుల మద్దతుతో మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల అర్హత స్థానాలను దక్కించుకోవడంలో ఈ టోర్నీ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ పోటీలు భారత ఫెన్సింగ్‌కు ఎంతో ముఖ్యమని భవానీ దేవి తెలిపారు. స్వదేశంలో అభిమానుల మధ్య ఆడటం గౌరవంగా ఉందని, ఆసియా క్రీడల అర్హతతో పాటు ఒలింపిక్ సైకిల్‌లో ముందడుగు వేయడానికి ఈ చాంపియన్‌షిప్ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సత్తా చాటేందుకు సిద్ధంగా..

స్వదేశంలో జరుగుతున్న ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత జట్టు నుంచి మెరుగైన ప్రదర్శనపై ఆశలు నెలకొన్నాయి. ఆసియా క్రీడల అర్హతతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుకునేందుకు భారత ఫెన్సర్లు సిద్ధంగా ఉన్నారు.

మహిళల ఫాయిల్ జట్టు: జాయ్స్ అశితా స్టాలిన్‌రాజ్, నోరెమ్ మీనా దేవి, సోనియా దేవి వైఖోమ్, మహిళల ఎపే జట్టు, తనిష్కా ఖత్రి, ప్రాచి లోహన్, మిత్వా జెసాంగ్‌భాయ్ చౌదరి.

మహిళల సేబర్ జట్టు: సీఏ భవాని దేవి, శ్రేయా గుప్తా, జెఫర్లిన్ జానీ రెక్స్లిన్ సిమ్లా, శ్రుతి జోషి.
పురుషుల ఫాయిల్ జట్టు: సచిన్, సనాసమ్ హేమాశ్ సింగ్, ఆదిత్య, తేజస్ మనోజ్ పాటిల్.
పురుషుల ఎపే జట్టు: శ్రేజిన్ రాజేంద్రన్ శాంతిమ్, జోసెఫ్ బెన్నెట్, శౌర్య అశ్విని, అలోషియస్ కూవక్కల్ జోషి.
పురుషుల సేబర్ జట్టు: కరణ్ సింగ్, గిషో నిధి కుమారేశ్ పద్మ, విశాల్ థాపర్, లక్షయ్ బద్సేర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>