కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణ (Telangana) నీటికి కర్నాటక గండి కొడుతున్నది. ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) (RDS) నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను అక్రమంగా మళ్లీంచుకునేందుకు కర్నాటక (Karnataka) సర్కార్ స్కెచ్ వేసింది. తాగునీరు పేరుతో కొత్తగా రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఎగువన 100 మీటర్ల దూరంలోనే తన భూభాగంలో కర్నాటక ప్రాజెక్ట్ ల నిర్మాణాలను వేగంగా చేస్తుండడం తాజాగా బయటపడింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అంతర్రాష్ట్ర జల ఒప్పందాల ప్రకారం ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు 17.1 టీఎంసీల నీటి వాటా దక్కాలి. కానీ ఇప్పటికే సగం కంటే తక్కువ (కేవలం 5 –7 టీఎంసీలు) మాత్రమే నీరు వస్తున్నది. ఇప్పుడు ఆర్డీఎస్‌కు కూతవేటు దూరంలోనే కర్నాటక నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రైతులకు చుక్క నీరు దక్కని పరిస్థితి తలెత్తనున్నది. మరోవైపు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల మేరకు ఇప్పటికే చాలా తక్కువగా తెలంగాణకు సాగునీరు అందుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అదనంగా మరో 2 టీఎంసీల నీటిని కర్నాటక మళ్లించుకుంటే ఆర్డీఎస్ కాల్వ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో మేధావులు, రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉమ్మడి మహబూబ్ నగర్ (వనపర్తి, జోగులాంబ గద్వాల) జిల్లాలో సుమారు 64,156 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్ధేశించిన కీలకమైన ఎత్తిపోతల ప్రాజెక్టు ఆర్టీఎస్. ఇది తుంగభద్ర నదిపై నిర్మించబడింది.
అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాల ఉల్లంఘన
అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాల ప్రకారం ఉమ్మడి ఆనకట్టల వద్ద ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ బీఎం), దిగువ రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, ఈ నియమాలను కర్నాటక ప్రభుత్వం తుంగలో తొక్కింది. మరోవైపు వేగంగా కొత్త ప్రాజెక్ట్ పనులు కొనసాగిస్తున్నది. ఇది పూర్తయితే భవిష్యత్తులో గద్వాల, అలంపూర్ ప్రాంతాల రైతుల పొలాలు సాగునీరు అందక బీడు భూములుగా మారిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నాటక కట్టే ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును కర్నాటక ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే, పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఆయకట్టు రైతులు హెచ్చరిస్తున్నారు.
– కేఆర్ బీఎంకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫిర్యాదు చేసి, అంతర్రాష్ట్ర జలాల ఒప్పందాల ఉల్లంఘనపై స్టే తీసుకొచ్చి వెంటనే పనులను నిలిపివేయాలని పేర్కొంటున్నారు.
– ఆర్డీఎస్ పరిధిలోని తెలంగాణలోని లక్షలాది ఎకరాల ఆయకట్టును, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కర్నాటక చేపడుతున్న ప్రాజెక్టుల పనులు అమల్లోకి వస్తే తెలంగాణకు అందే నీటి పరిమాణం మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
– ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆర్‌డీఎస్ ఆయకట్టు రైతులపై దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశముందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు కేటాయించిన నీటిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కర్నాటకతో చర్చలు జరపాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కోరుతున్నారు.
– ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
ఆర్డీఎస్ ఆనకట్టను బోర్డు పరిధిలోకి తేవాలి
ఆర్డీఎస్ ఆనకట్ట నిర్మించి 75 ఏళ్లు దాటిపోవడంతో దెబ్బతిన్నదని ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి తెలిపారు. దీని కట్టలు, నిర్మాణం, రివర్ స్లూయిస్‌లను మార్చి సరికొత్త స్ట్రక్చర్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, దీనిపై స్పందించిన అధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. “కర్నాటక పరిధిలో ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇంకా పూర్తి కాలేదు. అయితే.. ప్యాకేజీ-2 పనులు పూర్తి కానంత వరకు, ప్యాకేజీ 3, 4 పనులు చేసినా తెలంగాణకు రావాల్సిన వాటా నీరు (డిశ్చార్జ్) సక్రమంగా రాదు. ఆర్డీఎస్ ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 150 – 400 టీఎంసీల వరద నీరు వృథాగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వెళ్తున్నది. ఈ నీటిని నిల్వ చేసుకునేందుకు ఆర్డీఎస్ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలి” అని ఆయన పేర్కొన్నారు.
ఈ కీలకమైన ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టు సందర్శనకు కర్నాటక అధికారులు పూర్తి సమాచారంతో, బుక్‌లెట్లతో వచ్చారన్నారు. పైగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.30 కోట్ల బకాయిలు రావాలని ఆ రాష్ట్ర అధికారులు బోర్డుకు విన్నవించారని తెలిపారు. అయితే, తెలంగాణకు చెందిన కీలక అధికారులు (సీఈ, ఎస్ఈ) క్షేత్రస్థాయి పరిశీలనకు హాజరుకాకపోవడం, దిగువస్థాయి అధికారులు కొత్తవారు కావడంతో సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలిఆపరు. స్థానిక రాజకీయ నేతలు కూడా ఎవరూ రాకపోవడం విచారకరమన్నారు. కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ప్రాంత సమస్యలపై ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందని, కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్లి ఈ అంతర్రాష్ట్ర ప్రాజెక్టును పూర్తిగా బోర్డు పరిధిలోకి తీసుకువచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
కేఆర్ఎంబీ, కర్ణాటక ఆఫీసర్ల సందర్శన
మంగళవారం కేఆర్ఎంబీ అధికారులు, కర్ణాటక ప్రాంత చీఫ్ ఇంజనీర్లు, స్థానిక నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ సందర్శన. రెండు కిలోమీటర్ల మేర కెనాల్ వెంట అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలన. కెనాల్ అంతా పిచ్చి మొక్కలు, కంప చెట్లతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా మారిందని, రైతుల తరఫున ఆయకట్టు దారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

