కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి.జానకి (Mahabubnagar SP Janaki) ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డులోని ఏనుగొండ ఎదిర ఎక్స్ రోడ్డు, ఐడీఓసీ (IDOC) ఎదురుగా ఉన్న మహబూబ్‌నగర్–భూత్‌పూర్ రోడ్డులోని ప్రమాదకర మలుపు, అలాగే కోయిలకొండ–మహబూబ్‌నగర్ బైపాస్ సర్కిల్ ప్రాంతాల్లో ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు.
రోడ్ల నిర్మాణం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల వేగం, హెచ్చరిక బోర్డులు, రోడ్డు భద్రతా ఏర్పాట్లు, సిగ్నలింగ్, డివైడర్లు, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఎస్పీ (Mahabubnagar SP) సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ఐడీఓసీ ఎదురుగా ఉన్న ప్రమాదకర మలుపు వద్ద ప్రస్తుతం ఉన్న రంబుల్ స్ట్రిప్స్‌ను తొలగించి, వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందేలా అవసరమైన సూచిక (సైన్) బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. అలాగే ప్రమాదకర ప్రాంతాల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అవసరమైన చోట తక్షణ భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ తనిఖీల సందర్భంగా డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

