కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో విద్యా రంగాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈనెల 10న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ (Telangana Education Bandh) కు పిలుపునిచ్చాయి. భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సంయుక్త సమావేశంలో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి మునిగాల శివ ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీంద్ర మాట్లాడారు.
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేల క్లస్టర్ పాఠశాలలుగా కుదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, విద్యను వ్యాపారంగా మార్చే విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించడంతో పాటు, ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.
పేద విద్యార్థులకు భారంగా మారిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల బలవంతపు అమ్మకాలను కఠినంగా నియంత్రించాలని విద్యార్థి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 7 వేల కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక, శాస్త్రీయ విద్యను కాపాడుకోవడానికి ప్రతీ విద్యార్థి, విద్యాభిమాని జూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగస్వాములై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

