కలం, వెబ్ డెస్క్: ముంబైలో (Mumbai) పెరుగుతున్న ఖర్చులపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలో ఒక ఆటో డ్రైవర్ (Auto Driver) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉత్కర్ష్ వర్మ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన ప్రయాణంలో ఆటో డ్రైవర్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. సదరు డ్రైవర్ తన సంపాదన వివరాలను బయటపెట్టాడు. ఖర్చులన్నీ పోను రోజుకు సగటున రూ. 2,500 సంపాదిస్తున్నానని, అంటే నెలకు దాదాపు రూ.75,000 వరకు ఆదాయం వస్తుందని తెలిపాడు. కష్టపడే మనస్తత్వం ఉంటే సంపాదనకు కొదవలేదని, అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనే అసలైన నైపుణ్యం ఉందని ఆ డ్రైవర్ పేర్కొనడం విశేషం.
ఈ సంపాదన వివరాలు విన్న సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను బి.టెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన కొత్తలో తన జీతం కూడా ఇంత లేదని గుర్తు చేసుకున్నాడు. భారతదేశంలో రూ. 30 వేల ప్రారంభ జీతం ఆటో డ్రైవర్లకు మించి దక్కకపోవడం విచారకరమన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్ల కష్టాన్ని అభినందిస్తుండగా, మరికొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉండే భద్రత, సౌకర్యాలు ఆటో డ్రైవింగ్‌లో ఉండవని కామెంట్స్ చేస్తున్నారు.

