కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ కార్యదర్శులకు (Panchayat Secretaries) కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. పే స్కేల్‌ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో కీలక సవరణ చేస్తూ జీవో జారీ అయ్యింది. గతంలో 2025 నవంబర్ 4న విడుదల చేసిన జీవో నెంబర్ 91లోని ముసాయిదా ప్రకారం, గ్రేడ్-III పంచాయతీ కార్యదర్శుల వేతన శ్రేణిలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దుతూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఈ ఎర్రాటా నోటీసును విడుదల చేశారు. దీని ప్రకారం గత ఉత్తర్వుల్లో పొరపాటున పేర్కొన్న రూ. 28,280 – 89,720 వేతన శ్రేణికి బదులుగా, ఇకపై గ్రేడ్-III కార్యదర్శులకు రూ.25,220 – 80,910 వేతన శ్రేణి వర్తిస్తుందని స్పష్టం చేశారు.
పంచాయతీ రాజ్ వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కమిషనర్ నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంటూ, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రతిని సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లకు, ట్రెజరీ విభాగాలకు, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం నిమిత్తం పంపడం జరిగింది. అయితే దీనిపై పంచాయతీ కార్యదర్శులు (Panchayat Secretaries) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జీవో సవరణను ఉపసంహరించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Read Also: సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసు.. 9 మంది పోలీసులకు మరణశిక్ష
Follow Us On : WhatsApp

