కలం, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశీయ మొక్కలతో ప్రత్యేక వనాలను అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా సోమవారం ఆయన రాజనగరంలోని ప్రాంతీయ అటవీ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించి, అక్కడ పెరుగుతున్న వివిధ రకాల దేశవాళి మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో సుమారు 400 విభిన్న జాతులకు చెందిన రెండు లక్షలకు పైగా మొక్కలు ఉన్నాయని తెలిసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విలక్షణమైన మొక్కలను సద్వినియోగం చేసుకునేలా పంచాయతీరాజ్, అటవీ శాఖలు సంయుక్తంగా తక్షణమే ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని, దీనికి సంబంధించిన ప్రణాళికలను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజను అక్కడికక్కడే ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించే ఈ వనయజ్ఞంలో స్థానిక ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. దేశీయ మొక్కలను నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దక్కడంతో పాటు, మన సంస్కృతి, నాగరికత పరిఢవిల్లుతాయని ఆయన పేర్కొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను ఒక కర్తవ్యంగా భావించాలని, భావితరాలకు, పిల్లలకు ఈ మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. స్థానికుల భాగస్వామ్యం ఉన్నప్పుడే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుందని, తద్వారా పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రత్యేక వనాల ఏర్పాటు ద్వారా గ్రామ పంచాయతీలకు సరికొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వివరించారు. తక్కువ కాలంలోనే నాణ్యమైన కలపను ఇచ్చే వాణిజ్య మొక్కలను పెంచడం ద్వారా వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కలప కొరత ఉన్న తరుణంలో, ఈ ‘వుడ్ బ్యాంక్’ విధానం గ్రామాలకు స్వయం సమృద్ధిని తెచ్చిపెడుతుందన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతి లాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: అత్యవసర ప్రయాణం.. టికెట్ లేకున్నా ట్రైన్‌లో వెళ్లొచ్చా? రైల్వే రూల్స్ ఇవే
Read Also: సర్కార్ ఆస్పత్రులు అస్తవ్యస్తం

