కలం, వెబ్ డెస్క్ : స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అందరికీ జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. తెలుగు వాళ్లందరికీ మకరసంక్రాంతి, శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. అందరూ సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లాలి అని సూచించారు.
తాను 16 ఏళ్లుగా సొంతూరులో సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నట్లు చెప్పారు. సొంత గ్రామానికి వెళ్లడం ద్వారా మనుషుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. ఇతరులకు సాయం చేయాలన్న ఆలోచన కూడా వస్తుందని వెల్లడించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. జీవన ప్రమాణాలు పెంచడానికి P4 పేదరిక నిర్మూలన పథకం తీసుకువచ్చినట్లు Chandrababu Naidu తెలిపారు.


