కలం, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ(YSRCP) సభ్యులు కంపెనీలకు భూ కేటాయింపులపై ప్రశ్నలు సంధించారు. తక్కువ ధరకే భూములు కేటాయిస్తూ, తెరవెనుక ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. విశాఖలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని నిలదీశారు. తక్కువ ధరకే భూములు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సమాధానమిచ్చారు. కంపెనీలకు 99 పైసలకు ఎకరం భూములిచ్చామని ప్రచారం చేశారని, అది పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు.
వైసీపీ నాయకులు 99 పైసలకే భూ కేటాయింపులు చేశామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని గతంలోనే ఛాలెంజ్ చేశానని గుర్తు చేశారు. కానీ వాళ్లు ఆధారాలు తీసుకురాలేకపోయారని వెల్లడించారు. క్రెడిబులిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. భూములు ఇవ్వకుండా అసలు సంస్థలు ఎలా వస్తాయని, యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు.
ఇక మొదటి రోజు అసెంబ్లీలో (AP Assembly) డిజిటల్ అటెండెన్స్ విధానం అమలైంది. ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో రిజిస్టర్‌లో సంతకాలు చేసే ప్రక్రియకు స్వస్తి పలికి డిజిటల్ అటెండెన్స్ ప్రక్రియ ప్రారంభించారు. ఇక నుంచి సభ్యుల హాజరును డిజిటల్ విధానంలో రికార్డు చేయనున్నారు. అలాగే సభ్యులు తమ స్థానంలో కూర్చున్న తర్వాత కెమెరాల ద్వారా ఫేషియల్ రికగ్నిషన్‌తో అటెండెన్స్ నమోదు అవుతుంది. బుధవారం వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టసభల గౌరవం పెంచకపోయినా ఫర్వాలేదు కానీ, తగ్గించే హక్కు మనకు లేదన్నారు.
గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేయడం చూశాక చాలా బాధేసిందని తెలిపారు. ఆ దృశ్యాలు తలవంపులు తెచ్చేలా ఉన్నాయన్నారు. అసెంబ్లీ సాగే తీరును చూసేందుకు విద్యార్థులను అనుమతిస్తున్నామని, ఇలాంటి దృశ్యాలు చూసి విద్యార్థులు ఏం నేర్చుకుంటారని స్పీకర్ ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలను ఒక గంటలో పూర్తి చేయాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) వెల్లడించారు. అయితే ఎవరినీ ప్రశ్నలు అడగొద్దని అనడం లేదని, సంబంధం లేనివి అడగొద్దని మాత్రమే చెబుతున్నామని స్పష్టం చేశారు.
Read Also: రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్ జెట్స్.. సెంటర్ ఓకే
Follow Us On: X(Twitter)


