కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) పుట్టిన రోజు సందర్భంగా పవన్ భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ఎమోషనల్ డే అని అన్నా తన పోస్టులో పేర్కొన్నారు. అకీరా ఎదుగుతున్న తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, అకీరా ఎంతో దయ గల వ్యక్తిగా, నిరంతరం నేర్చుకునే తపన ఉన్న వ్యక్తిగా మారుతున్నాడని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే ఈ రోజు అకీరా నందన్ పుట్టిన రోజుతో పాటు, గతేడాది పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఓ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రోజు కూడా కావడంతో అన్నా లెజినోవా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం సింగపూర్‌లోని ఒక సమ్మర్ క్యాంప్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఈ ప్రమాదంలో పదేళ్ల ఫ్రేయా అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. మార్క్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, చేతులు, కాళ్లుకు కాలిన గాయాలయ్యాయని.. ఆ సమయంలో తను పడిన వేదన ఏ తల్లికి రాకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దేవుడి దయవల్ల మార్క్ ఆ ప్రమాదం నుంచి బయటపడి కోలుకొని ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడని అన్నా లెజినోవా (Anna Lezhneva) పేర్కొన్నారు. ఈ రోజు మార్క్‌కు రెండో పుట్టిన రోజులాంటిదని చెప్పారు. ఈ ప్రమాదంలో అగ్ని మాపక సిబ్బంది రాకముందే 15 మంది ప్రాణాలను కాపాడిన నిర్మాణ రంగ కార్మికులను ఆమె రియల్ హీరోలుగా అభివర్ణిస్తూ మెచ్చుకున్నారు. ఈ ప్రమాదం జరిగి ఏడాది గడుస్తున్నా ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందని తెలిపారు. కొందరు పిల్లలు ఇప్పటికీ సర్జరీల కోసం వేచి చూస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎవరూ ఇలాంటి ప్రమాదాల బారిన పడకూడదని ఆమె ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read Also: ‘రాకా’గా పవర్‌ఫుల్ లుక్‌లో అల్లు అర్జున్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
Follow Us On: X(Twitter)

