కలం, మెదక్ బ్యూరో: పేదల కడుపు నింపాల్సిన సన్నబియ్యం.. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిబంధనల జాప్యంతో ముక్కిపోతున్నాయి. అక్రమ రవాణాలో పట్టుబడిన వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం సరైన నిర్వహణ, వినియోగం లేక గోదాముల్లోనే నిల్వ ఉంటుండగా పురుగుల పాలవుతున్నాయి. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 14, 772 క్వింటాళ్ల రేషన్ బియ్యం (Ration Rice Wastage) ముక్కిపోయాయి. సరైన ప్రణాళిక, అధికారుల నిర్లక్ష్యంతో రూ .కోట్లలో ప్రజాధనం వృథా అవుతున్నది. ప్రస్తుతం ఎల్ నినో నేపథ్యంలో మార్కెట్ లో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. ధరలు కూడా భారీగా ఉన్నాయి.
వర్షాలు లేక ఖరీఫ్ సీజన్ లో పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. భవిష్యత్ లో ఎల్ నినో పరిస్థితులు కొనసాగితే ఆహార కొరత కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి బియ్యం గింజను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. కానీ కోట్ల విలువైన బియ్యం గోదాముల్లో నిల్వ ఉంటూ ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో నలభై వేల క్వింటాళ్ల బియ్యం గోదాముల్లోనే ముక్కిపోతున్నాయని అధికారుల అంచనాగా ఉంది.
నెలలుగా గోదాముల్లోనే నిల్వ ..
నెలలు గడుస్తున్నాకొద్దీ గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం (Ration Rice Wastage) నాణ్యత దెబ్బతింటున్నది. తేమ, సరైన నిల్వ సదుపాయాలు, నిర్వహణ లేమితో ముక్కిపోతున్నాయి. చివరకు పశువుల దాణాకు కూడా పనికిరాని పరిస్థితి ఉంటుంది. పట్టుబడిన బియ్యం నాణ్యతను పరీక్షించి, వినియోగానికి అనువుగా ఉన్నవాటిని వెంటనే వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుంది. నిబంధనలతో పాటు అధికారుల నిర్లక్ష్యంతో పట్టుబడిన బియ్యం నిల్వ చేస్తుండడంతో ఎందుకు పనికి రాకుండాపోతుంది. జహీరాబాద్ పరిధి కోహిర్ మండలం దిగ్వాల్ ఎఫ్ సీఐ గోదాములో 3,100 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉన్నాయి. సరైన నిర్వహణ లేక, నెలలుగా బస్తాల్లో ఉండటంతో బియ్యం సంచులు పూర్తిగా పాడైపోయి, పురుగులు పట్టి వృథాగా మారాయి. ప్రసుత్తం బియ్యం చూస్తే కోళ్ల దాణాకు తప్ప దేనికీ పనికి రాని పరిస్థితిలో ఉన్నాయి.
పట్టించుకోని అధికారులు
సరిహద్దు రాష్ట్రాల్లోకి భారీగా రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతుంటే అధికారులు చూసిచూడనట్టుగా వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా భారీగా పెరిగింది. అయితే అప్పుడప్పుడు తనిఖీలు చేసి రేషన్ బియ్యం పట్టుకొని అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పట్టుబడిన బియ్యాన్ని గోదాములకు తరలించిన తర్వాత సివిల్ సప్లై వేలం వేయాల్సి ఉంటుంది. వాటిని పుడ్ గ్రేయిన్ లైసెన్స్ దారులు, ఇతర రైస్ వ్యాపారులు పాల్గొని కొంటారు. అలా వేలం వేయగా వచ్చిన డబ్బులు ప్రభుత్వ ఖనాజా వెళ్తాయి. బియ్యం వ్యాపారుల ద్వారా మార్కెట్ లోకి వెళ్తాయి.
అయితే రెండేళ్లుగా వేలం ప్రక్రియ చేపట్టకపోవడంతో వేలాది క్వింటాళ్ల బియ్యం గోదాముల్లో నిల్వ ఉంది. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో వేలం ప్రక్రియ నిర్వహించలేదని పౌర సరఫరా శాఖ అధికారులు చెబుతున్నారు. కోర్టు కేసులు, నిబంధనల పేరుతో అధికారుల నిర్లక్ష్యం చివరకు బియ్యం పనికి రాకుండా పోతుండగా వదిలేస్తున్నారు. ప్రభుత్వం వద్ద కూడా స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో పాటు నిబంధనలు, పట్టుబడిన బియ్యానికి సంబంధించిన కేసులను సాకులుగా చూపుతూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి పట్టుబడ్డ బియ్యం వెంటనే వేలం వేయడమో, లేదా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఎల్ నినో గడ్డు పరిస్థితుల్లో బియ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం సరికాదని ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
సరిహద్దు రాష్ట్రాలకు అడ్డాగా జహీరాబాద్
పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం రేషన్ బియ్యం అందిస్తుండగా.. మరోవైపు అక్రమార్కులకు వరంలా మారింది. టన్నుల కొద్దీ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కర్నాటక, మహారాష్ట్రకు సరిహద్దులో ఉంది. దీని ద్వారానే అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతున్నది. రాష్ట్రంలో అక్రమంగా సేకరించిన బియ్యాన్ని రహస్యంగా జహీరాబాద్ నుంచి సరిహద్దు దాటిస్తుండగా రేషన్ మాఫియా నుంచి అధికారులు పట్టుకుంటున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సమీపంలోని గోదాముల్లోకి తరలిస్తున్నారు. అక్కడే గుట్టలు పేరుకుపోతూ ముక్కిపోతున్నాయి.

