కలం, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయం వద్ద మరో డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది. టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఐదో డైనింగ్ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 4.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ కొత్త హాల్ ద్వారా అదనంగా మరో 500 మంది భక్తులు ఒకేసారి కూర్చుని భోజనం చేసే వెసులుబాటు కలుగుతుంది.
దీంతో పాటు వెంకటాద్రి నిలయం వద్ద సుమారు 1,500 మంది సామర్థ్యంతో కూడిన మరో డైనింగ్ హాల్‌ను కూడా టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. వంటశాలలో పరిశుభ్రత, ఆహార తయారీ వేగాన్ని పెంచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సహకారంతో సుమారు రూ.120 కోట్లతో ఆధునిక కిచెన్, ఆటోమేషన్ పనులతో పాటు శాటిలైట్ కిచెన్ ఏర్పాట్లపైనా దృష్టి సారించింది.
తిరుమల అన్నప్రసాద కేంద్రంలో రోజూ ఉదయం 8:30 నుండి 10:30 వరకు బ్రేక్‌ఫాస్ట్, ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు మధ్యాహ్న భోజనం, అలాగే సాయంత్రం 5:00 నుండి రాత్రి 10:30 గంటల వరకు రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నారు. 2011 జులై 7న ప్రారంభమైన ఈ కాంప్లెక్స్‌లోని నాలుగు హాళ్ల ద్వారా ప్రస్తుతం టీటీడీ నిత్యం సుమారు 90,000 నుండి 1,00,000 మంది భక్తులకు ఉచిత అన్నప్రసాదాన్ని అందిస్తోంది.

