కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ చీరల (Indiramma Sarees) పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట వేదికగా ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించిన ప్రభుత్వం.. ఈ నెల 17 నాటికే జిల్లా కేంద్రాలకు దాదాపు 65 లక్షల చీరలను డిస్పాచ్ చేసింది. ఆసిఫాబాద్, జనగాం, మల్కాజిగిరి లాంటి జిల్లాలకు ఇప్పటికే 100 శాతం చేరుకున్నాయి. అనివార్య కారణాలతో ఈ ప్రోగ్రామ్‌ను ఈ నెల 26వ తేదీకి (రాజ్యాంగ దినోత్సవం) ప్రభుత్వం వాయిదా వేసింది.
కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం బఫర్ స్టాక్‌గా మరో 5.66 లక్షల చీరలను రెడీ చేసింది. కొన్ని జిల్లాల్లోని సంప్రదాయం ప్రకారం తొమ్మిది మీటర్ల చీరలను మహిళలు ధరించే ఆనవాయితీ ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 3.64 లక్షల మేర ఆ తరహా చీరలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తం 20 జిల్లాల్లో ఈ వెరైటీ చీరలను పంపిణీ చేయనున్నది. మిగిలిన 96 లక్షలకు పైగా చీరలు 6.30 మీటర్ల వెరైటీకి చెందినవి. నాలుగు రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాలకు ఇండెంట్ ప్రకారం మొత్తం చీరలను పంపేలా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.
చీరల డిజైన్లు ఇలా..
తొమ్మిది మీటర్ల చీరలు చిలక ఆకుపచ్చ ప్లెయిన్, మెరూన్ (డార్క్ రెడ్) బార్డర్‌తో తయారయ్యాయి. మరో వెరైటీ చీరలు చిలక ఆకుపచ్చ కలర్లోనే డిజైన్‌తో కూడి ఉంటాయి. వీటికి జరీ తరహా మెరూన్ కలర్ బార్డర్ ఉంటుంది. ఇవి సుమారు 96 లక్షలకు పైగా తయారయ్యాయి. తొమ్మిది మీటర్ల చీరల పంపిణీ 20 జిల్లాల్లోనే ఉంటుంది. జగిత్యాల, హనుమకొండ, భూపాలపల్లి, గద్వాల, మెదక్, ములుగు, సిద్దిపేట తదితర జిల్లాలకు ఇప్పటికే వంద శాతం ఈ వెరైటీ చీరల పంపిణీ పూర్తయినట్లు పంచాయతీరాజ్ వర్గాలు తెలిపాయి.
జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాలు, గ్రామాలకు చీరలను పంపిణీ చేయడానికి అధికారులు ప్రత్యేక మెకానిజం రూపొందించారు. గతేడాది పంపిణీ చేసిన పాలపిట్ట రంగులోని ఇందిరమ్మ చీరలను మహిళలు ఇప్పటికీ కట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి ఇటీవలే వ్యాఖ్యానించారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా ఈసారి చిలక ఆకుపచ్చ రంగును, డిజైన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. కోటి మంది మహిళలకు అందించనున్నట్లు సీఎం ప్రకటించడంతో ఈ నెల 26న లాంఛనంగా డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది.
ఏ జిల్లాకు ఎన్ని చీరలు: (6.30 మీటర్ల వెరైటీ)
హైదరాబాద్ : 9,85,571
ఖమ్మం : 5,24,043
నల్లగొండ : 5,18,616
నిజామాబాద్ : 3,64,302
రంగారెడ్డి : 3,40,100
సిద్దిపేట్ : 3,26,399
కొత్తగూడెం : 3,29,635
హనుమకొండ : 3,22,079
కామారెడ్డి : 3,05,560
నారాయణపేట : 2,97,401
జగిత్యాల : 2,96,541
సూర్యాపేట : 2,96,343
మొత్తం : 89,33,970
బఫర్ స్టాక్ : 5,66,030
ఈ జిల్లాలకు తొమ్మిది మీటర్ల చీరలు :
నిర్మల్ : 58,320
ఆదిలాబాద్ : 43,382
జగిత్యాల: 42,780
మంచిర్యాల: 34,009
నిజామాబాద్ : 31,792
మొత్తం : 3,63,737

