కలం, నిర్మల్: అంగన్వాడీ టీచర్లు, ఆయాల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ కు బయలుదేరిన నిర్మల్ జిల్లాలోని అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేయడంపై తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (Nirmal CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి శైలజ తీవ్రంగా ఖండించారు. బుధవారం నిర్మల్ పట్టణ పోలీస్స్టేషన్ లో ఆమె మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు.
అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీసం రూ.18 వేల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పీఎం శ్రీ ఆధారిత ప్రీ ప్రైమరీ విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలను అనంతరం సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు.

