కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాసంలో ఎమ్మెల్యేల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ మొదలైంది. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చిస్తున్నారు. అసెంబ్లీ బయట ఎలాంటి పోరాటాలు చేయాలో దిశానిర్దేశం చేయబోతున్నారు. సభలో లేవనెత్తాలనుకున్న అంశాలను బయట ఉండే ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో.. వ్యూహాలు సిద్ధం చేసుకోబోతున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే కోకాపేటలోని కేటీఆర్ నివాసంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేపు మాక్ అసెంబ్లీ నిర్వహణ..
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. కేటీఆర్, హరీశ్ రావు సహా పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. సభ తరహాలోనే ఇక్కడ పలు అంశాలపై చర్చించబోతున్నారు. తమను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుని.. ప్రతిపక్షం లేకుండానే చర్చలు చేపడుతోందని కేటీఆర్ ఇప్పటికే విమర్శలు గుప్పించారు.

