కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుండి ‘జనగణన-2027′(Census-2027) ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రాజెక్టు డైరెక్టర్ నివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపడతామని వెల్లడించారు. ఇళ్ల సంఖ్య, ఆ ఇళ్లలో నివసిస్తున్న వారి ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం ఈ దశలో ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.
ఈసారి జనగణనలో ప్రజలు తీసుకునే ఆహార వివరాలపై ప్రధానంగా ఆరా తీస్తామని నివాస్ వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్రంలోని పోషకాహార లభ్యత, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ గణనలో ప్రజల కులం (Caste) లేదా మతం (Religion) వంటి సున్నితమైన వివరాలను సేకరించబోమని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, డేటా సెక్యూరిటీ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. జనగణన విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

