కలం, వెబ్ డెస్క్: సాయిబాబు ఆలయాలకు టీటీడీ నిధుల కేటాయింపు అనే అంశంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) మరోసారి స్పందించారు. సాయిబాబా ఆలయాలకు టీటీడీ శ్రీవాణి పథకం కింద నిధులు ఇవ్వకపోవడం అంటే సాయిబాబాను, ఆయన భక్తులను అవమానించడం కాదని చెప్పారు. ఇది కేవలం ట్రస్టు నిబంధనలకు సంబంధించిన అంశం మాత్రమే తప్ప, భక్తికి సంబంధించినది కాదని ట్విట్టర్ (X) వేదికగా స్పష్టతనిచ్చారు. మన సమాజంలో రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారితో పాటు సాయిబాబా పట్ల ప్రజలకున్న అపారమైన విశ్వాసాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని చెప్పారు.
నా వ్యాఖ్యలు వక్రీకరించారు..
సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది పూర్తిగా వక్రీకరించారని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా సాయిబాబా భక్తుడినని.. ప్రతిరోజూ ఉదయం తమ పూజా మందిరంలో షిర్డీ సాయిబాబాని భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాతే తన దినచర్యను ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల ఉద్దేశం ఎవరినీ నొప్పించడం కాదని చెప్పారు. ఒకవేళ ఏ ఒక్క భక్తుని మనోభావాలైనా దెబ్బతిని ఉంటే హృదయపూర్వకంగా మన్నించమని కోరారు. సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ప్రతి భక్తుని విశ్వాసాన్ని గౌరవించడమే మన ప్రభుత్వ స్పష్టమైన విధానం. కాబట్టి, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ ప్రయత్నాలను ఎవరూ నమ్మవద్దని కోరుతున్నాను.
ఎవరిపైనా వివక్ష చూపడం లేదు..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గానీ, దేవాదాయ శాఖ గానీ, టీటీడీ గానీ ఎవరిపైనా వివక్ష చూపడం లేదని.. ఎవరి విశ్వాసాలనూ కించపరచదని మంత్రి స్పష్టం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపడుతున్న 5,000 భజన మందిరాల నిర్మాణ కార్యక్రమానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉందని తెలిపారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ – ప్రచారం, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ హిందూ దేవాలయాల నిర్మాణమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నిధుల విడుదల అనేది పూర్తిగా శ్రీవాణి ట్రస్టు నిబంధనలు, మార్గదర్శకాలు, పరిపాలనా విధానాల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేశారు.

