కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) మాట్లాడారు. ఇది అమరావతి రైతుల విజయమన్న ఆమె.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాము పూర్తి మద్దతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే 12 ఏళ్ల తర్వాత ఈ బిల్లు మళ్లీ రావడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాలసీ పెరాలసిస్ కారణంగా పన్నెండు సంవత్సరాలు ఏపీ నష్టపోయిందని చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. హామీలు అమలు చేయనందుకు తగిన పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు గడిచినా ఆస్తుల పంపకం పూర్తికాలేదని విమర్శించారు. ఈ అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరిస్తోందని విమర్శలు గుప్పించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ హామీని కూడా ఎన్డీయే సర్కార్ నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు.
ఆ గ్రామాలు తిరిగి తెలంగాణలో విలీనం:
భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామ పంచాయతీలను (ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల) ఆంధ్రప్రదేశ్ నుండి తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నా వాళ్లను ఏపీలో కలిపారని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసమే ఏపీకి విభజన హామీలు అమలు చేస్తున్నారని.. తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నారని అన్నారు.

