కలం డెస్క్: ఈ ఏడాది మే, జూన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కేరళ (Kerala) పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఫోకస్ పెట్టారు. అక్కడ బీజేపీ ‘కింగ్’ కావాలని.. లేదంటే ‘కింగ్ మేకర్’ గానైనా చక్రం తిప్పాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. దశాబ్దాలుగా ఎల్ డీఎఫ్, యూడీఎఫ్ కూటముల చుట్టూ మారుతున్న అధికారాన్ని ఈసారి ఎన్డీయే వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తిరువనంతపురం కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న జోష్ లో ఉన్న కమల దళం.. అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని చూస్తున్నది.
ఇదీ వ్యూహం
‘మిషన్ 2026’ పేరిట ఆదివారం తిరువనంతపురంలో అమిత్ షా (Amit Shah) క్యాంపెయిన్ ను మొదలు పెట్టారు. పంచకట్టులో కనిపించారు. ‘వికసిత్ కేరళ (Viksit keralam)’ నినాదంతో ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. 15 శాతంగా ఉన్న పార్టీ ఓటు షేర్ ను భారీగా పెంచడంపై ఫోకస్ పెట్టాలన్నారు. ‘అయ్యప్ప’ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు తెలిసింది. శబరిమల (Sabarimala) ఆలయ ఆభరణాల చోరీ వ్యవహారాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో అస్త్రంగా మలచుకోవాలని కమలం నేతలు చూస్తున్నారు. ఇప్పటికే ఆలయ ప్రధాన పూజరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు బీజేపీ పట్టుబడ్తున్నది. దీనిపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్ డీఎఫ్ (LDF), కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటములు రెండూ ఒకటేనని.. హిందువులంటే ఆ కూటములకు గిట్టదనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లి.. హిందూ ఓటు బ్యాంకును రాబట్టుకోవాలని కమలం పార్టీ చూస్తున్నది.
35 స్థానాలు పక్కా?
కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 35 స్థానాల్లో తమకు గట్టి పట్టు ఉందని బీజేపీ భావిస్తున్నది. వాటితో పాటు మరో 50 సీట్లే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టింది. తిరువనంతపురం మేయర్ పీఠాన్నే దక్కించుకున్నామని.. ఇదే ఉత్సాహంతో ‘మిషన్ 2026’ టార్గెట్ను రీచ్ అవుతామని, కేరళలో అధికారపగ్గాలు చేపడ్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనంలో కేంద్రంలోని మోదీ పాలనపై ఆదరణ ఉందని అంటున్నారు. గతంలో త్రిచూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపీ ఎంపీగా గెలువడంతో.. క్రైస్తవ మైనారిటీల మద్దతు కూడా తమకు లభిస్తుందని వారు అంచనా వేసుకుంటున్నారు. ఎల్ డీఎఫ్, యూడీఎఫ్ కూటములతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని.. ఈసారి ఎన్డీయే వైపు నిలబడ్తారని భావిస్తున్నారు.
Read Also: భారత్‌పై భారీ ఉగ్ర కుట్ర.. మసూద్ ఆజార్ ఆడియో లీక్
Follow Us On: Sharechat


