కలం, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America) ప్రపంచ వేదికపై మరోసారి సంచలనానికి తెరలేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక మెమోరాండంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాలతో సహా మొత్తం 66 అంతర్జాతీయ సంస్థలు, ఒప్పందాల నుంచి అమెరికా తక్షణమే వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయని, దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా మారాయని వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా పన్ను చెల్లింపుదారుల రక్తం, చెమటతో కూడిన నిధులను ఇలాంటి వృధా సంస్థలకు ఇవ్వడం ఇకపై సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఈ నిర్ణయంతో వైదొలిగిన 66 సంస్థల్లో 31 ఐక్యరాజ్యసమితి (UN) విభాగాలు కాగా, మిగిలిన 35 ఇతర అంతర్జాతీయ సంస్థలు. వీటిలో ముఖ్యంగా వాతావరణ మార్పులపై పోరాడే అంతర్జాతీయ వాతావరణ ఒప్పందం (UNFCCC), క్లైమేట్ ప్యానెల్ (IPCC) వంటి కీలక సంస్థలు ఉన్నాయి. అలాగే భారత్, ఫ్రాన్స్ దేశాల నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance) నుండి కూడా అమెరికా తప్పుకోవడం గమనార్హం. వీటితో పాటు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA), యుఎన్ విమెన్ వంటి సామాజిక సంస్థల నుంచి కూడా నిష్క్రమించింది. ఈ సంస్థలన్నీ కూడా అమెరికా విలువలకు వ్యతిరేకంగా ‘గ్లోబలిస్ట్ అజెండా’ను ప్రోత్సహిస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ చర్యను సమర్థిస్తూ, అమెరికా (America) ఆర్థిక బలాన్ని దెబ్బతీసే సంస్థలలో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే 2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునెస్కో నుంచి వైదొలిగిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ 66 సంస్థల నుంచి బయటకు రావడంతో తన ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అమెరికా మాత్రం అంతర్జాతీయ నియమాల కంటే దేశాభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తోంది.
Read Also: ప్రణయ్ హత్య కేసు.. హైకోర్టు సంచలన తీర్పు
Follow Us On: Sharechat


