కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఓటమి పాలవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫినిషర్‌గా విఫలమవుతున్న షారుఖ్ ఖాన్ విషయంలో యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షారుఖ్ ఖాన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. గత రెండు సీజన్లుగా ఆయన ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదని రాయుడు గుర్తు చేశారు. గతేడాది కంటే ఆట మెరుగుపడకపోతే, ఆయనపై నమ్మకం ఉంచడం వృధా అని రాయుడు స్పష్టం చేశారు. భారీ అంచనాల మధ్య జట్టులోకి వచ్చిన షారుఖ్, తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నారని విమర్శించారు.
గుజరాత్ పేస్ దళంపై కూడా రాయుడు స్పందించారు. జట్టులో మొహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, కగిసో రబాడలలో ఒకరిని పక్కన పెడితేనే జట్టు సమతుల్యంగా ఉంటుందని సూచించారు. ప్రసీద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నందున, సిరాజ్ లేదా అశోక్ శర్మలలో ఒకరిని తొలగించక తప్పదని ఆయన అన్నారు. ఒకవేళ రబాడను తప్పిస్తే జాసన్ హోల్డర్‌ను తీసుకోవడం ద్వారా బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుందని సలహా ఇచ్చారు. జట్టులో ఐదుగురు నాణ్యమైన బ్యాటర్లు ఉండాలని రాయుడు (Ambati Rayudu) అభిప్రాయపడ్డారు. గ్లెన్ ఫిలిప్స్‌తో పాటు టాప్ ఆర్డర్‌కు అండగా టామ్ బాంటన్ వంటి ఆటగాడిని మిడిల్ ఆర్డర్‌లోకి తీసుకురావాలని సూచించారు. స్పిన్, పేస్‌ను సమానంగా ఎదుర్కొనే బ్యాటర్లు జట్టుకు అవసరమని ఆయన పేర్కొన్నారు. మొదటి మ్యాచ్‌లో 9.3 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 83 పరుగులతో బలంగా ఉన్న గుజరాత్, చివరకు 162 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ ఈ లక్ష్యాన్ని మూడు వికెట్ల తేడాతో ఛేదించి విజయం సాధించింది. తదుపరి మ్యాచ్‌లకైనా గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్ ఈ లోపాలను సరిదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి.
Read Also: ఆర్‌సీబీ సక్సెస్ సీక్రెట్ ఇదే.. కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు!
Follow Us On: Facebook

