కలం, వెబ్ డెస్క్ : పిల్లలను కనడం కోసం సరికొత్త నగదు ప్రోత్సాహం ప్రకటించిన సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. పిల్లల్ని కనమని చెప్పే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు అని మండిపడ్డారు. గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ… పిల్లల్ని కనడానికి వేలం పాట వేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం ఒకడినే కంటారని.. మిగతా వారిని మాత్రం పిల్లల్ని కనండి, మూడో సంతానానికి రూ. 30 వేలు, నాల్గవ సంతానానికి రూ. 40 వేలు ఇస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక స్తోమత బాగున్నవాళ్లే పిల్లల్ని కనలేకపోతున్నారని, పిల్లల్ని పెంచడం కష్టమవుతోందని ఆరోపించారు. స్కూల్లో చేర్చడానికి ఎంతవుతోంది? చదివించాలంటే ఎంతవుతోంది? వాళ్ల భవిష్యత్తు ఏంటి? ఇవేమీ చంద్రబాబుకు అవసరం లేదని ఫైర్ అయ్యారు. పిల్లల్ని కనండి డబ్బులిస్తా అంటున్న చంద్రబాబు కుటుంబం మాత్రం ఒక సంతానాన్నే కలిగి ఉంటారని.. రేపు చంద్రబాబు మనవడు కూడా ఒకడినే కంటాడని, ఇది రాసుపెట్టుకోండి అంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇదేనా సంపద సృష్టి, ఇదేనా సుపరిపాలన అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే “లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన అంబటి.. కమీషన్లు వచ్చే పనులపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

