కలం, వెబ్‌డెస్క్: కాఫీ కేవలం రోజూ తాగే పానీయమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన ఔషధం కూడా. నేటి కాలంలో మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీముల కంటే, ఇంట్లోనే సహజంగా లభించే కాఫీ పొడితో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు చర్మ నిపుణులు. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయట. ఇటువంటి కాఫీ పొడిని ఎలా ఉపయోగించాలో (Coffee Beauty Benefits) తెలుసుకుందాం.
కాఫీ స్క్రబ్
చర్మానికి కాఫీపొడి మంచి స్క్రబ్‌లా పని చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. స్నానం చేసే సమయంలో కాఫీపొడిని నూనె/జెల్‌తో కలిపి చర్మంపై రుద్దుకోవడం వలన చర్మంపై ఉన్న మృతకణాలను సులభంగా తొలగిస్తుందట. స్క్రబింగ్ కోసం కాఫీ గింజలను కూడా వాడచ్చని చెబుతున్నారు నిపుణులు.
సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ ఏజెంట్
కాఫీ యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా కూడా పని చేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. దీనికోసం రెండు కప్పుల కాఫీ గింజలకు ఒక కప్పు నీటిని, కొన్ని చుక్కల టీట్రీ నూనెను కలపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను బ్లెండర్‌తో బాగా కలిపి, బ్రష్‌తో ముఖానికి అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలట. ఈ మిశ్రమం చర్మాన్ని బిగుతుగా మార్చుతుందని చెబుతున్నారు నిపుణులు.
జుట్టు సంరక్షణకు కాఫీ
కాఫీ జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేసి జుట్టును మృదువుగా అయ్యేలా చేస్తుందంటున్నారు నిపుణులు. దీనికోసం కాఫీపొడిని నీటిలో వేసి బాగా మరిగించాలట. తర్వాత దీనిని ఒక గిన్నెలోకి వడపోయాలి. ఈ నీటిని జుట్టుకు అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటుని చెబుతున్నారు నిపుణులు.

