Mobile Popup Ad
Mobile Popup Ad

పెద్దాసుపత్రికి పెద్ద కష్టం: నిజామాబాద్ జీజీహెచ్ దయనీయ స్థితి!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Nizamabad GGH) మళ్లీ అనాథలా మారింది. గతంలో లాగే మరోసారి పూర్తిస్థాయి డాక్టర్లు, సిబ్బంది లేక విసిరేసినట్టు మారుమూల ప్రాంత ఆసుపత్రిలా దయనీయ స్థితికి చేరుకున్నది. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవల ఆసుపత్రిని సందర్శించి, ఇక్కడి సమస్యలు చూసి వసతుల కోసం బడ్జెట్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ నిధులు దేవుడెరుగు అసలు పెద్దాసుపత్రిని నడిపించే పెద్ద సారు.. డాక్టర్లు, సిబ్బంది ఇప్పుడు లేకుండా పోయారు.

127 డాక్టర్ పోస్టులు ఖాళీ ..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సాధారణ బదిలీల వల్ల నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది భారీగా బదిలీపై వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి 36 మంది డాక్టర్లు రాష్ట్రంలోని పలు మెడికల్ కాలేజీలకు బదిలీ కాగా, తిరిగి జీజీహెచ్ కు కేవలం 11 మంది మాత్రమే వచ్చారు. మొత్తం మంజూరైన డాక్టర్ల పోస్టులు 272 కాగా, ప్రస్తుతం కేవలం 145 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఏకంగా 127 పోస్టులు ఖాళీగా మిగిలాయి.

48 మంది నర్సులు వెళ్తే.. వచ్చింది 11 మందే

డాక్టర్లతో పాటు సేవల్లో ఎంతో కీలకమైన నర్సింగ్ సిబ్బంది కొరత కూడా ఆసుపత్రిని వేధిస్తున్నది. జీజీహెచ్లో ఇటీవల వరకు 264 మంది నర్సింగ్ సిబ్బంది ఉండేవారు. ప్రస్తుత బదిలీల్లో 48 మంది వెళ్లిపోగా, వారి స్థానంలో కేవలం 11 మంది మాత్రమే వచ్చారు. దీంతో మరో 37 నర్సింగ్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఫలితంగా ఇన్పేషెంట్లకు సేవలు అందడం మరింత కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. ఈ స్థాయిలో పోస్టులు ఖాళీ కావడం పదేండ్లలో ఇదే తొలిసారి అని ఆసుపత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వర్షాకాలం వైద్యం ఎలా..?

నిజామాబాద్ ఆసుపత్రిలో ప్రస్తుతం రోజుకు ఓపీ 1800 నుంచి 2000 వరకూ నమోదవుతున్నాయి. ఇన్ పేషెంట్లుగా చేరేవారు 120 మంది ఉంటారు. అన్ని విభాగాల్లో కలిపి 800 నుంచి 900 మంది రోగులకు చికిత్స చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఆసుపత్రి కిటకిటలాడుతుంది. నర్సింగ్, వైద్య సిబ్బంది కొరతతో సేవలు అందడం కష్టంగా మారే పరిస్థితి నెలకొంది. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది ఇటీవల ఎక్కువ సంఖ్యలో బదిలీ అయ్యారు. జీజీహెచ్ కు మాత్రం కొంత మంది మాత్రమే వచ్చారని ఆసుపత్రి వర్గాలు వాపోతున్నాయి.

ప్రైవేట్ వర్గాల పనేనా..?

మూలిగే నక్కపైతాటిపండు పడ్డ చందంగా నిజామాబాద్ జీజీహెచ్ (Nizamabad GGH) సూపరింటెండెంట్ కుర్చీ మళ్లీ మారింది. మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణుడు నాగమోహన్కు గతంలో ఇక్కడ సూపరింటెండెంట్గా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆసుపత్రిని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ యాంజియోగ్రామ్, స్టెంట్లు, ప్లాస్టిక్ సర్జరీ వంటి అధునాతన ఖరీదైన సేవలను పేదలకు చేరువ చేశారు. ఇంతలోనే మళ్లీ పాత కథే రిపీట్ అయింది. ఇన్ఛార్జీ సూపరింటెండెంట్ నాగమోహన్ హైదరాబాద్కు బదిలీ అయ్యారు. అయితే, ప్రభుత్వాసుపత్రి సేవలు మెరుగుపడితే ఇబ్బంది అనుకునే ప్రైవేట్ వర్గాల లాబీయింగ్ వల్లే ఈ బదిలీలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తాజా బదిలీలతో ఫోరెన్సిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, మానసిక వైద్యం, బయోకెమిస్ట్రీ విభాగాల్లో సేవలు ప్రశ్నార్థకంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>