Mobile Popup Ad
Mobile Popup Ad

అమావాస్య ఎఫెక్ట్.. స్కూల్ రీఓపెనింగ్ రోజే వెలవెలబోయిన క్లాస్ రూమ్‌లు

కలం, ఖమ్మం బ్యూరో: నేటి ఆధునిక ప్రపంచంలో ఒక వైపు సాంకేతికత పరుగెడుతోంది.. మరో వైపు సమాజం ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. సైన్స్ అద్భుతాలు సృష్టిస్తోంది. కానీ, కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్లు మాత్రం ఇప్పటికీ జనాల ఆలోచనలను శాసిస్తూనే ఉన్నాయని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో సోమవారం నాటి పాఠశాలల పునఃప్రారంభం స్పష్టం చేసింది. వేసవి సెలవుల తర్వాత సరికొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం.. మొదటిరోజే ఒక వింతైన వాతావరణంలో నెమ్మదిగా అడుగులు వేసింది.

​సాధారణంగా జూన్ నెలలో బడులు తెరిచే మొదటిరోజు అంటే అదొక పండుగ వాతావరణం. కొత్త పుస్తకాల పరిమళాలు, సరికొత్త దుస్తులు, స్నేహితుల కోలాహలం, టీచర్ల పలకరింపులతో క్లాస్ రూమ్‌లు కళకళలాడుతుంటాయి. కానీ, ఈ విద్యా సంవత్సరం తొలిరోజు భద్రాద్రి జిల్లాలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ​జిల్లావ్యాప్తంగా మొత్తం 44,095 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉండగా.. కేవలం 5,540 మంది మాత్రమే స్కూళ్ల బాట పట్టారు. అంటే జిల్లా చరిత్రలోనే అత్యంత అరుదుగా తొలిరోజు కేవలం 13 శాతం హాజరు మాత్రమే నమోదైంది. జిల్లాలోని మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యాశాఖ యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నా, విద్యార్థులు లేక తరగతి గదులన్నీ వెలవెలబోయాయి.

​ఈ వింత పరిస్థితికి కారణం ఎండ తీవ్రత అనుకుంటే పొరపాటే.. దీని వెనుక ఉన్న అసలు కారణం “అమావాస్య ఎఫెక్ట్” (Amavasya Effect). పాఠశాలలు పునఃప్రారంభమైన సోమవారం నాడే ‘అమావాస్య’ రావడం ఈ నిరసన హాజరుకు ప్రధాన కారణమైంది. ​గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోని చదువుకున్న తల్లిదండ్రులు సైతం ఇక్కడ ఒక బలమైన సెంటిమెంట్‌ను నమ్మారు. అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించకూడదని, ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో మొదటిరోజు బడికి పంపడం అరిష్టమనే నమ్మకంతో చాలామంది తమ పిల్లలను ఇంట్లోనే ఉంచేశారు. ​తొలిరోజు మంచి ముహూర్తంలో అడుగుపెడితేనే చదువు బాగా వస్తుందని, అమావాస్య రోజు పంపితే కలిసిరాదనే భావన మెజారిటీ తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుపోయింది. కాబట్టే 87 శాతం మంది విద్యార్థులు తొలిరోజు బడికి దూరంగా ఉండిపోయారనేది స్పష్టం అవుతుంది.

​టెక్నాలజీ యుగంలోనూ, విద్యావంతులైన తల్లిదండ్రులు సైతం చదువుల పండుగపై ఇలాంటి నమ్మకాలతో వెనకడుగు వేయడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల ప్రవేశానికే ‘ముహూర్తాలు, అమావాస్యలు’ అడ్డురావడం సామాజిక ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. నమ్మకాలు వ్యక్తిగతమైనప్పటికీ.. చదువు వంటి పవిత్రమైన విషయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు పిల్లల క్రమశిక్షణ, హాజరుపై తొలిరోజే ప్రభావం చూపడం గమనార్హం.

​తొలిరోజు అమావాస్య సెంటిమెంట్‌తో క్లాస్ రూమ్‌లు బోసిపోయినా, బుధవారం నుంచి బడులు పూర్తిస్థాయిలో ఊపందుకోనున్నాయి. ఎందుకంటే రేపు మంగళవారం కూడా చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను స్కూల్ కి పంపడానికి ఇష్టపడరు. కాబట్టి మంగళవారం సెంటిమెంట్ కూడా రేపు అడ్డుపడుతుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అమావాస్య, మంగళవారం గడిచిన తర్వాత ఎల్లుండి ఉదయం నుంచే విద్యార్థులందరూ పాఠశాలలకు వస్తారని, విద్యాసంవత్సరం వేగంగా పుంజుకుంటుందని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బుధవారం నుంచి బడులు ప్రారంభం అంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు.

ఏదేమైనా.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే భద్రాద్రి జిల్లాలో నమోదైన ఈ “13 శాతం హాజరు” ఉదంతం మాత్రం ఒక వింతైన రికార్డుగా నిలిచిపోనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>