కలం, వెబ్ డెస్క్: ఇటీవల విడుదలైన రామ్ చరణ్ (Ram Charan) పెద్ది సినిమా (Peddi Movie)కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఏపీలోని అల్లూరి సితారామరాజు (Alluri Sitharama Raju) జిల్లాలో పలువురు గిరిజన సంఘాల నాయకులు పెద్ది సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షలకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో గిరిజనులను కించపరిచే విధంగా కొన్ని సీన్లు, డైలాగులు ఉన్నాయంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పెద్ది సినిమా బృందం, సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకు ఫిర్యాదు చేశారు. సినిమా మొత్తంలో 15 సార్లు గిరిజనులను కించపరిచేలా పదాలు వాడారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసిన పదాలనే సినిమాలో అసభ్యంగా వినియోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో వినియోగించిన అవే పదాలను సోషల్ మీడియాలో పలువురు ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు కూడా ఇష్టానుసారం వినియోగించటంపై మండిపడ్డారు.
దీనిపై రాష్ట్ర, కేంద్ర ఎస్టీ కమిషన్లను కూడా ఆశ్రయిస్తామని గిరిజన నేతలు వెల్లడించారు. తమకు జరుగుతున్న అవమానాలపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తామని తెలిపారు. తక్షణమే పెద్ది సినిమా హీరో, డైరెక్టర్, నిర్మాతలు గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ వ్యవహారంతో విమర్శలు మూటగట్టుకుంటున్న పెద్ది మూవీకి గిరిజన సంఘాల ఫిర్యాదు మరో తలనొప్పిగా మారింది.

