Mobile Popup Ad
Mobile Popup Ad

అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ రంగులు, పక్షపాతాలకు తావులేకుండా, కేవలం అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని రాజుపేట, గట్టు సింగారం గ్రామాల్లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేవలం ఇళ్లను మంజూరు చేసి చేతులు దులుపుకోవడం లేదని, లబ్ధిదారులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిర్మాణ పురోగతి ఆధారంగా ప్రతి సోమవారం క్రమం తప్పకుండా బిల్లులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. రాజుపేట గ్రామంలో మంజూరైన గృహాల్లో 4 పూర్తయ్యాయని, గట్టు సింగారం గ్రామంలో 19 ఇళ్లకు గాను ఇప్పటికే 10 ఇళ్లు పూర్తై లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకోవడం సంతోషకరమన్నారు.

ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించి, వారి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని మంత్రి చెప్పారు. అర్హులైన చివరి లబ్ధిదారుడికి ఇల్లు అందే వరకు దశల వారీగా ఈ పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని కూడా ప్రారంభించామని గుర్తు చేశారు. ​నూతనంగా నిర్మించుకున్న ఇళ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఇళ్లలో ఆత్మగౌరవంతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>