మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు మంజూరు

కలం, భువనగిరి : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ, మహిళా సాధికారతకు బాటలు వేసేలా జిల్లాలోని 17 మండలాలకు ప్రభుత్వం ‘టీజీఎస్ ఆర్టీసీ’ ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను మంజూరు చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ బస్సులను తెలంగాణ ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడపనున్నారు. జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇదిలాఉంటే.. మండల మహిళా సమాఖ్యల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. మంజూరైన ప్రతి బస్సు విలువ రూ. 36 లక్షలుగా ఉంది.

ఇందులో రూ. 30 లక్షలను జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నిధుల ద్వారా మంజూరు చేశారు. మిగిలిన రూ. 6 లక్షలను ఆయా మండల మహిళా సమాఖ్యలు తమ సొంత నిధులైన ‘కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్’ ద్వారా సమకూర్చాయి. ఈ నిధులతో కొనుగోలు చేసిన బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అద్దెకు ఇచ్చారు. ఒప్పందంలో భాగంగా ఆర్టీసీ సంస్థ ప్రతి నెల నిర్ణీత గడువు లోపల రూ.69,468 లను ఈఎంఐ రూపంలో అద్దె కింద మహిళా సమాఖ్యలకు చెల్లిస్తుంది. దీనివల్ల మహిళా సంఘాలకు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం చేకూరనుంది.

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం..

జూన్ 9న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి – విజయోత్సవ సదస్సు నిర్వహిస్తోంది. ఈ మహా సదస్సు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలకు మంజూరైన మొత్తం 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాకు చెందిన 17 మండలాల సరికొత్త టీజీఎస్ ఆర్టీసీ బస్సులు కూడా రేపటి నుంచే రోడ్డెక్కనున్నాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also: ఫిల్మ్ నగర్‌లో సింగీతం శ్రీనివాసరావుకు ఘన ట్రిబ్యూట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>