జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలు, ప్రజలంతా ఈ ఎన్నిక కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు అధికారులు ప్రతి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు.
యూసఫ్‌గూడలోని డీఆర్‌సీ సెంటర్‌లో ఎన్నికల అధికారులు సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి, నియోజకవర్గాల వారీగా కేంద్రాల కేటాయింపులు పూర్తి చేశారు. సాయంత్రానికల్లా అన్ని పోలింగ్ సిబ్బంది తమ తమ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలు, బూత్‌లలో వేసే ఓట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయడానికి పోలీసు బలగాలను భారీగా మోహరించారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ల సహాయంతో సెక్యూరిటీ మానిటరింగ్ చేపట్టనున్నట్టు ఆర్వీ కర్ణన్ తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశామని, చట్టం-శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ప్రతి అభ్యర్థికి ఒక్క పోలింగ్ ఏజెంట్ పాస్ మాత్రమే జారీ చేశామని స్పష్టం చేశారు. ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు తాగునీరు, కుర్చీలు, షేడ్లు వంటి అన్ని సదుపాయాలను కల్పించామని తెలిపారు. పోలింగ్ రోజు ప్రజలు భయపడకుండా, నిరభ్యంతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆహ్వానించారు.
Read Also: సిద్దరామయ్యకు నో అపాయింట్‌మెంట్
Follow Us on : Pinterest

