కలం, తెలంగాణ బ్యూరో: పోలీస్ ఉద్యోగ నియామకాల (Police Recruitment) భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని హోంశాఖ ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ కేటగిరీల్లో 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనున్నది. ఇప్పటికే నోటిఫికేషన్, రిజర్వేషన్, దరఖాస్తు ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలు రావడంతో యూత్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. నియామక ప్రక్రియకు భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి.. ఇంటెలిజెన్స్, హోంశాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డీజీపీ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి విజయ్‌కుమార్, హోంసెక్రటరీ శిఖా గోయల్, సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి: సీఎం
ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి నియామక ప్రక్రియపై చర్చించారు. ఈ ప్రాసెస్ పకడ్బందీగా, పూర్తి పాదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి లోపాలకు ఆస్కారం ఇవ్వొద్దని, నియమ నిబంధనలను అనుసరించి జరిగేలా చూడాలన్నారు. ప్రశ్నాపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.
కోచింగ్ సెంటర్లమీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటలీజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

