కలం, వెబ్ డెస్క్: అమెరికాలో ఉద్యోగ వీసాలతో (US Visa) పనిచేస్తున్న విదేశీయులకు సంబంధించిన నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పును ప్రతిపాదించింది. ప్రస్తుతం కొత్త ఉద్యోగ వీసా తీసుకునే సమయంలో మాత్రమే వసూలు చేస్తున్న అదనపు రుసుమును, వీసా గడువు ముగిసిన తర్వాత దానిని పొడిగించుకునే (రెన్యూవల్) సమయంలో కూడా వసూలు చేయాలని భావిస్తున్నది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులను కొనసాగించేందుకు ఆయా సంస్థలు మరింత అదనపు ఖర్చు భరించాల్సి రావచ్చు.
హెచ్ 1 బీ, ఎల్ 1 వీసాలకు వర్తింపు
ఈ ప్రతిపాదన ప్రధానంగా హెచ్ 1బీ, ఎల్1 ఉద్యోగ వీసాలకు వర్తిస్తుంది. హెచ్-1బీ వీసా అనేది అమెరికాలో విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఉపయోగించే వీసా. ఎల్-1 వీసా ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అదే సంస్థ అమెరికా కార్యాలయానికి బదిలీ చేస్తుంది. ప్రస్తుతం అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగులు ఉండి, వారిలో కనీసం సగం మంది హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాలపై పనిచేస్తున్న సంస్థలు కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుకు 4,000 డాలర్లు, కొత్త ఎల్-1 వీసాకు 4,500 డాలర్ల అదనపు రుసుము చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఇదే రుసుమును వీసా గడువు పొడిగించే ప్రతి దరఖాస్తుకూ వర్తింపజేయాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించింది.
వీసా పొడిగింపుల్లో భారతీయులే అధికం
అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ గణాంకాల ప్రకారం 2025లో ఆమోదం పొందిన హెచ్-1బీ వీసా పొడిగింపుల్లో దాదాపు 78 శాతం భారతీయులవే. దీంతో భారతీయ ఉద్యోగులను ఎక్కువగా నియమించుకున్న ఐటీ కంపెనీలపై ఈ నిర్ణయం ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇప్పటికే విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో మాత్రమే ఉంది. తుది నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాతే కొత్త రుసుము, అమలు తేదీ వంటి వివరాలు వెల్లడికానున్నాయి.

