కలం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. సాగునీటి ప్రాజెక్టులకు క్లియరెన్సులు, పర్యావరణ అనుమతులు, పొరుగు రాష్ట్రాలతో జలాల వివాదాలు, ట్రిబ్యునల్‌లో నడుస్తున్న కేసు.. తదితర అంశాలను చర్చించనున్నారు. కేంద్రం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తున్నందున ఆ అంశంపై ఏఐసీసీ నిర్వహించనున్న కీలక సమావేశంలో పాల్గొననున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే వయసును 25 ఏండ్ల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి.. ఈ నెల 17 లేదా 18న ఒక రోజు అసెంబ్లీ సెషన్ నిర్వహించాలనుకుంటున్నారు. అనంతరం 20 నుంచి రెండువారాలు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా టూర్ కొనసాగనున్నది.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు క్లియరెన్సుపై మీటింగ్
సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ, అటవీ అనుమతులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటల తర్వాత పార్లమెంటులో పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్‌తో సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రావాల్సిన క్లియరెన్సులు, జల వివాదాలు.. వీటిపై జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పార్లమెంటులోనే కలవనున్నారు. ఎన్డీఎస్ఏ నిర్ణయంపై కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించే అవకాశమున్నది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని కరువు పరిస్థితి, సాగునీటి ఇబ్బందులపై వివరించనున్నట్లు తెలిసింది. మంత్రి ఉత్తమ్ సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్‌ను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసుకున్నందున దానికి చెల్లించాల్సిన రూ. 13,600 కోట్ల మేర ఫండింగ్ అంశంపైనా, సెకండ్ ఫేజ్ ప్రాజెక్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్నందున అవసరమైన అనుమతులు ఇవ్వడంపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. అక్కడ వచ్చే రిజల్టుకు అనుగుణంగా ఆ తర్వాత రైల్వే మంత్రితో భేటీ అయ్యే అవకాశమున్నది. అనంతరం ఏఐసీసీ పెద్దలను కలిసి పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించే అవకాశమున్నది.

