Mobile Popup Ad
Mobile Popup Ad

ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీలు భ‌ర్తీ చేయాలి: ఏఐవైఎఫ్

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ (AIYF) నాయ‌కులు విమ‌ర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేర‌కు కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్లపల్లి యుగేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నాయ‌న్నారు. నిరుద్యోగ యువత వయోపరిమితి దాటిపోతూ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఖాళీలపై పూర్తి వివరాలు వెల్లడించకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి బదులుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉద్యోగ భద్రతను దూరం చేస్తున్నారన్నారు. ఇది నిరుద్యోగ యువత పట్ల అన్యాయం మాత్రమే కాకుండా ప్రజా సేవల నాణ్యతను కూడా దెబ్బతీస్తోందన్నారు. ప్రభుత్వ విద్యారంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం, మౌలిక వసతుల కొరత, నిధుల లోపం కారణంగా ప్రభుత్వ విద్య బలహీనపడుతోందన్నారు . ఇదే సమయంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని, ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడంలో విఫలమవుతోంద‌ని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని శాఖల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నాయ‌కులు డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలను రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని ప్ర‌భుత్వానికి సూచించారు. టీజీపీస్సీసీ ద్వారా వార్షిక నియామక క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు చెంచల మురళి, పినమల్ల భాస్కర్, మాడిశెట్టి అరవింద్, తదితరులు పాల్గొన్నారు.

 Read Also: పాలేరు ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి కీలక హామీలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>