కలం, ఖమ్మం బ్యూరో : రాబోయే నెల రోజులలో పాలేరు (Paleru) నియోజకవర్గ పరిధిలోని అన్ని భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) స్పష్టమైన హామీ ఇచ్చారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్‌లో జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకరతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన 14 క్లస్టర్లలో ఇప్పటికే 13 క్లస్టర్ల కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని, చివరి క్లస్టర్‌గా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 15 డివిజన్లలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ దశలో సుమారు 3,500కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న నమ్మకమే ప్రజాదర్బార్‌లకు భారీ స్పందన రావడానికి కారణమని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 21,536 దరఖాస్తులు అందగా, వాటిలో ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్లు, భూ సమస్యలు, గృహజ్యోతి పథకానికి సంబంధించినవి ఉన్నాయని వివరించారు.
అర్హులైన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇప్పటివరకు రూ.66 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు మంత్రి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డి.ఎఫ్.ఓ. అనూజ్ అగర్వాల్, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ అనిత, వైస్ చైర్మన్ నవీన్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

