కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి పెండింగ్ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ (AITUC) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ లు హెచ్చరించారు. బుధవారం కొత్తగూడెం శేషగిరి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేనిపక్షంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ప్రధానంగా కారుణ్య ఉద్యోగాలపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో మెడికల్ వ్యాలిడేషన్ కోసం ఎదురు చూస్తున్న కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారని, కాబట్టి పెండింగ్ లో ఉంచిన మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు రూ.50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని చెల్లించకుండా కావాలని సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లి సంస్థను సర్వనాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, యాజమాన్యం కలిసి, కొత్త గనులను ప్రారంభించకుండా సంస్థలో కార్మికులు అధికసంఖ్యలో ఉన్నారని మెడికల్ బోర్డు నిలిపివేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదేవిధంగా క్రమం తప్పకుండా స్ట్రక్చర్ కమిటీని నిర్వహించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ (AITUC) డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, వై.వి రావు, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, సందబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: రేపే ఎన్నికలు.. ఒక్క ఓటుకు రూ.25 వేలు!
Follow Us On: Sharechat

