కలం, కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక హక్కులు, చట్టాలను మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) ఆరోపించారు. ఆ చట్టాలను తిప్పి కొట్టాల్సిన అవసరం కార్మికంలోకంపై ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను నాయకులతో కలిసి చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు.
సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలుస్తున్న ఏఐటీయూసీ శ్రమకు తగ్గ ఫలితం కావాలని డిమాండ్ చేశారు. పని గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, కనీస వేతనాల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. ఎంతోమంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి అనేక చట్టాలు తీసుకువచ్చిన కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) అని తెలిపారు.
పోరాడి సాధించుకున్న సమ్మె చేసే హక్కును కాలరాయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు. కార్పోరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించి కార్మికుల పొట్టలు కొడుతున్న నరేంద్ర మోడీకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం కార్మిక లోకం చెప్పాలన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6,7,8 తేదీలలో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ నాలుగవ మహాసభలను విజయవంతం చేయడానికి మొదటి రోజు జరిగే బహిరంగ సభకు వేలాదిగా కార్మిక వర్గం తరలిరావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, టేకుమల్ల సమ్మయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, న్యాలపట్ల రాజు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు వెల్దండి దామోదర్, రజిత, పిట్టల సమ్మయ్య, కడారి బీరయ్య, కాశెట్టి లక్ష్మణ్, జంగ తిరుపతి, పిట్టల శ్రీనివాస్, జక్కుల ఆగయ్య, దాసరి ప్రభాకర్, రాకేష్, కెమ్మసారం శ్రీనివాస్, అల్లేపు రాజు, మొగిలిపాలెం మల్లేశం, పోచయ్య, లక్ష్మణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

