భూత్పూర్ పోలీస్​ స్టేషన్​ లో ఎస్పీ తనిఖీలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) సూచించారు. గురువారం భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ పరిశీలించి, సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల పరిస్థితి, కేసుల దర్యాప్తు తదితర అంశాలను సమీక్షించారు.

ఇన్‌స్పెక్టర్ స్థాయిలో దర్యాప్తు చేస్తున్న కేసులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, నాణ్యమైన ఆధారాలతో కేసులను కోర్టులో సమర్థవంతంగా నిరూపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు.

సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓలతో క్రమం తప్పకుండా నేర సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న నేరాలపై విశ్లేషణ చేయాలని సూచించారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, పాత నేరస్తులు, రౌడీషీటర్లు , అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతమైన, ప్రజా అనుకూల పోలీసింగ్‌ను కొనసాగించాలని తెలిపారు.

మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

భూత్పూర్ సర్కిల్ పరిధిలో భూత్పూర్, మూసాపేట, అడ్డాకల్, దేవరకద్ర, సీసీ కుంట పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, వీటి పరిధిలో జాతీయ రహదారి-44 భూత్పూర్, మూసాపేట, అడ్డాకల్ మీదుగా, జాతీయ రహదారి-167 దేవరకద్ర, సీసీ కుంట మీదుగా వెళ్తున్నందున జాతీయ రహదారులపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.

అదేవిధంగా బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గ్రామాలు, కాలనీల్లో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా పోలీసింగ్ నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ వార్షిక తనిఖీలో భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, భూత్పూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ నాగన్న, భూత్పూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్-2 విద్యా, అడ్డాకల్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ మురళి, దేవరకద్ర సబ్‌ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డితో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>